© 2026 nimisham.in

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Dr Subhash Chandra Case: తుది లీగల్ ఆర్డర్ లేకుండా పదిహేను రోజులుగా సాగుతున్న మీడియా ట్రయల్‌పై నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) దృష్టికి ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర తీసుకువెళ్లారు. అదేవిధంగా ఈ కేసును మళ్లీ మొదటి నుంచి ఏకంగా ఐదుగురు సభ్యుల ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దీనిపై నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ ముందు సుభాష్ చంద్ర తరుఫున న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారు. NCLAT తాత్కాలిక ఛైర్మన్ జస్టిస్ యోగేష్ ఖన్నా, సాంకేతిక సభ్యులు బరుణ్ మిత్రా, అజయ్ దాస్ మెహ్రోత్రాలతో కూడిన ధర్మాసనం ముందు బుధవారం ఈ పిటిషన్లపై విచారణ జరిగింది.
సుభాష్ చంద్ర తరఫున సీనియర్ న్యాయవాది సస్మిత్ పాత్ర వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుతం ఈ కేసులో ఎలాంటి అధికారిక తుది ఉత్తర్వు అమల్లో లేదని స్పష్టం చేశారు. అయినా.. రూ.22,006 కోట్ల మేర ఉన్న క్లెయిమ్‌లకు బదులుగా ఆయన కేవలం రూ.6.5 కోట్లు మాత్రమే చెల్లిస్తున్నారంటూ ఆయన ప్రతిష్టను దిగజార్చేలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. ఈ రూ.22,006 కోట్ల రుణం సుభాష్ చంద్ర వ్యక్తిగతంగా తీసుకున్నది కాదని.. ఎస్సెల్ గ్రూప్ కంపెనీలు తీసుకున్న రుణాలకు ఆయన గ్యారెంటర్‌గా మాత్రమే ఉన్నారని చెప్పారు. ఆయన వ్యక్తిగత ఆస్తుల నికర విలువ రూ.31.79 కోట్లు ఉండగా.. దాని ఆధారంగానే నిబంధనల ప్రకారం రూ.6.25 కోట్లు రుణదాతలకు, మరో రూ.25 లక్షలు న్యాయ ప్రక్రియ ఖర్చుల కోసం రీపేమెంట్ ప్లాన్‌ను రూపొందించారని వివరించారు.
రీపేమెంట్ ప్లాన్‌ను ఆమోదిస్తూ ఎలాంటి తుది ఉత్తర్వులు వెలువడనప్పుడు 6.5 కోట్ల రూపాయల అంశాన్ని లేవనెత్తి ఒక పర్సనల్ గ్యారెంటర్ ప్రతిష్టను దిగజార్చే కుట్ర చేశారని ట్రిబ్యునల్‌కు తెలిపారు. మరోవైపు లెండర్స్ తరఫున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ వాదనలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు ప్రొసీడింగ్స్‌ను మీడియా ప్రకటనల కోసం ఉపయోగించవద్దని కోరారు. అయితే డాక్టర్ చంద్ర తరఫు న్యాయవాదులు మాట్లాడుతూ.. నిబంధనలకు లోబడి, పూర్తి పారదర్శకతతో చట్టపరమైన ప్రక్రియను అనుసరిస్తున్నామన్నారు. వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు.
అదేవిధంగా రీపేమెంట్ ప్లాన్‌పై పునరాలోచన కోసం NCLT అకస్మాత్తుగా ఐదుగురు సభ్యులతో కూడిన లార్జర్ బెంచ్‌ను ఏర్పాటు చేయడంపై సుభాష్ చంద్ర తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కంపెనీల చట్టం, IBC లోని సెక్షన్ 419(5) ప్రకారం న్యాయమూర్తుల మధ్య అభిప్రాయభేదాలు వస్తే కేసును మరొక సభ్యుడికి పంపాలి తప్ప.. నేరుగా ఐదుగురు సభ్యుల బెంచ్‌ను ఏర్పాటు చేసే అవకాశం లేదని వాదించారు. అలాగే ప్లాన్ ఆమోదానికి మద్దతుగా జుడీషియల్ మెంబర్ నీలేష్ శర్మ ఇచ్చిన అభిప్రాయంపై ఏ అధికారంతో, ఎప్పుడు స్టే విధించారో చెప్పాలని ప్రశ్నించారు.
NCLTలోని ముగ్గురు సభ్యుల అభిప్రాయాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయంటూ లెండర్స్ ప్రచారం చేస్తున్న కథనాన్ని కూడా డాక్టర్ సుభాష్ చంద్ర న్యాయవాదులు తిప్పికొట్టారు. జుడీషియల్ మెంబర్లు అశోక్ కుమార్ భరద్వాజ్, నీలేష్ శర్మ ఇద్దరూ రీపేమెంట్ ప్లాన్‌ను ఆమోదించడానికి అనుకూలంగానే ఉన్నారని కోర్టు రికార్డుల ద్వారా నిరూపించారు. సెక్షన్ 79 కింద ఈ ప్లాన్ చెల్లుబాటుపై వారిద్దరూ పూర్తి ఏకీభవించారని.. కేవలం విభేదించిన క్రెడిటర్ల విషయంలోనే స్వల్ప తేడా ఉందని తెలిపారు. అలాంటప్పుడు ఈ వ్యవహారాన్ని మళ్లీ కొత్తగా లీగల్ వివాదాల్లోకి లాగడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. కాబట్టి అర్హతతో సహా అన్ని అంశాలను మొదటినుంచి మళ్లీ విచారించాల్సిన అవసరం లేదని వాదించారు.
మీడియా ప్రచారంపై ఉన్న అభ్యంతరాలను ఇన్సాల్వెన్సీ విచారణలు జరుగుతున్న NCLT ఎదుటే లేవనెత్తవచ్చని NCLAT స్పష్టం చేసింది. అలాగే ఐదుగురు సభ్యుల బెంచ్ ఏర్పాటుపై అసంతృప్తి ఉంటే.. సెప్టెంబర్ 1 నాటి ఆ ఉత్తర్వును సుభాష్ చంద్ర స్వతంత్రంగా వేరే పిటిషన్ ద్వారా సవాలు చేసుకోవచ్చని ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను అక్టోబర్ 7కి వాయిదా వేసింది.
డాక్టర్ సుభాష్ చంద్ర తరఫున వచ్చిన బలమైన వాదనలతో లెండర్ల న్యాయవాదులు డిఫెన్స్‌లో పడిపోయారు. మొదట తమ అప్పీళ్లను వెనక్కి తీసుకుంటామని చెప్పినా.. ఆ అప్పీళ్లు అసంపూర్తిగా, లోపభూయిష్టంగా ఉన్నాయని డాక్టర్ చంద్ర న్యాయవాదులు ఎత్తిచూపడంతో వారు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఐదుగురు సభ్యుల బెంచ్ ఉత్తర్వులను విడిగా సవాలు చేసే పూర్తి సడలింపును డాక్టర్ చంద్రకు NCLAT కల్పించింది. దీని ద్వారా చట్టం, వాస్తవాల ఆధారంగా సాగుతున్న ఈ పోరాటంలో డాక్టర్ సుభాష్ చంద్ర స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నట్లు అర్థమవుతోంది.