© 2026 nimisham.in

ఇంటర్నెట్ డెస్క్: భారత్ తరఫున మూడు కీలక యుద్ధాల్లో ప్రాణం పెట్టి పోరాడిన వీరుడతను. దేశ రక్షణకు సేవలందించిన ఆ మాజీ సైనికుడు నేడు వృద్ధ్యాప్యంలో అక్రమార్కులతో మరోసారి పోరాటం ప్రారంభించారు.
ఆయనే హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 92 ఏళ్ల విశ్రాంత సైనికుడు కెప్టెన్ చున్నీ లాల్. 1962, 1965, 1971 యుద్ధాల్లో భారత్ తరఫున పోరాడిన కెప్టెన్ చున్నీ లాల్‌కు చెందిన 25 బిఘాల (సుమారు 15 ఎకరాలు) భూమిని ఆయనకే తెలియకుండా కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి అమ్మేశారు. దీంతో ఆయన మరోసారి తన పోరాటాన్ని ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్డా ప్రాంతానికి చెందిన విశ్రాంత సైనికుడు చున్నీ లాల్‌కు చెందిన భూమిని పాంగ్ డ్యామ్ ప్రాజెక్ట్ కింద ప్రభుత్వం తీసుకుంది.అనంతరం రాజస్థాన్‌లోని జైసల్మేర్ మోహన్గఢ్ప్రాంతంలో 25 బిఘాల వ్యవసాయ భూమిని ప్రభుత్వం కేటాయించింది. అప్పట్లో వ్యవసాయానికి తగినంత నీటి సదుపాయాలు లేకపోవడంతో ఆయన తిరిగి తన సొంత రాష్ట్రానికి వచ్చి ఉంటున్నారు. ఇటీవల కాలంలో తన భూమి వద్దకు వెళ్లగా అది ఇతరుల పేరుమీద బదిలీ అయినట్లు తెలుసుకుని కంగుతిన్నారు. లాల్ అని చెప్పుకున్న ఓ వ్యక్తి గతనెల 6న స్థానిక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి నకిలీ డాక్యుమెంట్లతో భూమిని అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు విశ్రాంత సైనికుడు ఆరోపించారు. దీనికి సంబంధించి కెప్టెన్ లాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. మోసం, ఫోర్జరీకి సంబంధించి పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై కెప్టెన్ లాల్ స్పందిస్తూ.. ‘మూడు యుద్ధాల్లో పాల్గొన్న నేను.. నా భూమిని రక్షించుకోవడానికి ఇలా ప్రభుత్వ కార్యాలయాలు, పోలీసు స్టేషన్ల చుట్టూ ఎన్నడూ తిరగాల్సి వస్తుందనుకోలేదు. రిజిస్ట్రేషన్ సమయంలో అధికారులు ధ్రువపత్రాలను సరిగ్గా చెక్‌చేసి ఉంటే ఈ మోసం జరిగి ఉండేదికాదు’ అని అన్నారు. తన తండ్రికి ఇది నాలుగో యుద్ధం లాంటిదని ఆయన కుమారుడు ముల్తాన్ సింగ్ అన్నారు. గత మూడు రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నామని, దీంతో తన తండ్రి ఆరోగ్యం దెబ్బతిందని ముల్తాన్ చెప్పారు. ఈ విషయంలో తమకు సహాయం చేస్తామని అక్కడి ఎస్పీ తెలిపారని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.